Pakistan: చైనా ఖైదీలతో 'సీపెక్' ప్రాజక్టు పనులు చేయిస్తున్నారు!: బయటపెట్టిన పాక్ ఎంపీ
- సీపెక్ పనులు చేపట్టిన చైనా ఖైదీలు
- దీని వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్న నవాబ్ మహ్మద్
- పాక్, చైనాల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటుంది
చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) పేరుతో 60 బిలియన్ డాలర్లతో పాక్ భూభాగంలో చైనా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం చైనా జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను తీసుకొచ్చి, సీపెక్ రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నారని వెల్లడైంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ పార్లమెంటు సభ్యుడు నవాబ్ మహ్మద్ యూసఫ్ తల్పూర్ బయటపెట్టారు. అలాంటి ఖైదీలు ఇక్కడ కూడా నేరాలు చేసే అవకాశాలున్నాయని, అందువల్ల సీపెక్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సి ఉందని ఆయన సలహా ఇచ్చారు.
దీనిపై పాక్ హోంశాఖను సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఖైదీలను ఉపయోగించుకోవడం సాధారణమే అయినప్పటికీ, చైనా నుంచి ఖైదీలను పాక్ కు తీసుకురావడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీలను తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదని, దీని గురించి రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, సీపెక్ లో పనిచేస్తున్న చైనా దేశీయులకు ప్రత్యేక భద్రత కల్పించామని పాక్ ప్రత్యేక సెక్రటరీ (ఇంటీరియర్) రిజ్వాన్ మాలిన్ తెలిపారని డాన్ పత్రిక కథనం ప్రచురించింది.