jadcherla: జడ్చర్లలో 100 పడకల వైద్యశాల..త్వరలో శంకుస్థాపన!
- రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి
- నమూనాలను పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
- నిర్మాణం చేపట్టిన ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశాలు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రూ.20 కోట్ల వ్యయంతో 100 పడకల హాస్పిటల్ నిర్మించనున్నారు. ఈ మేరకు వైద్య శాల నిర్మాణ నమూనాలను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్రెడ్డిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి కొత్త భవన నిర్మాణంపై సమీక్షించారు. నూతన నమూనాలను పరిశీలించారు.
ఆయా నమూనాలల్లో కొన్నింటిని చివరి ఎంపిక కోసం ఉంచాలని ఆదేశించారు. అవసరమైన మార్పులు, చేర్పులు కూడా మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. త్వరలోనే డిజైన్లను ఫైనల్ చేయాలని, శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని, ఏడాదిలోగా భవనాలను నిర్మాణానికి సిద్ధం చేయాలని, వైద్య పరికరాలను సైతం అత్యాధునికమైనవి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
కాగా, జడ్చర్ల (బాదేపల్లి) లో చాలా కాలంగా 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం పని చేస్తున్నది. కాల క్రమేణా గ్రామంగా ఉన్న బాదేపల్లి, జడ్చర్లలు కలసిపోయి విస్తరించాయి. నగర పంచాయతీ కాస్తా నగరపాలక సంస్థగా మారిపోయింది. జడ్చర్ల-బాదేపల్లిల విస్తరణతో పాటు పెరిగిన జనాభాకనుగుణంగా వైద్యశాల ఏర్పాటు చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.
ప్రస్తుతం ఉన్న సామాజిక వైద్యశాల ఆవరణలోనే ఆ వైద్యశాలను అప్ గ్రేడ్ చేస్తూ, అదనపు భవనాలను నిర్మించాలని తలపెట్టారు. అందుకు అవసరమైన అనుమతులన్నీ మంజూరయ్యాయి. కానీ, అక్కడి స్థలం సరిపోకపోవడం, అందుబాటులో మరింత స్థలం లేకపోవడంతో నూతన భవనాన్ని మరోచోట నిర్మించడానికి నిర్ణయించారు. దీంతో స్థల సేకరణ మొదలైంది. కొన్ని చోట్ల స్థలాలు పరిశీలించాక, అందులోనే 100 పడకల నూతన వైద్యశాలను నిర్మించాలని లక్ష్మారెడ్డి నిర్ణయించారు.