nagaland: రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 'సున్నా'!
- ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ
- త్రిపుర, నాగాలాండ్ లలో ఆధిపత్యం
- ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం
మూడు ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. త్రిపుర, నాగాలాండ్ లలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకుపోతోంది. త్రిపురలో 59 స్థానాలకు గాను 41 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో త్రిపురలో బీజేపీకి ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం.
నాగాలాండ్ లో 60 స్థానాలు ఉండగా... ఎన్డీపీపీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది.
కాంగ్రెస్ విషయానికి వస్తే త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్క స్థానంలో కూడా ఆధిపత్యాన్ని కొనసాగించలేక, చతికిల పడింది. గత ఎన్నికల్లో త్రిపురలో 10 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్... ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితి ఉంది. నాగాలాండ్ లో తనకు ఉన్న 8 సిట్టింగ్ స్థానాలను కూడా కాంగ్రెస్ కోల్పోనుంది. మేఘాలయలో మాత్రం 59 స్థానాలకు గాను 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గతంతో పోలిస్తే ఇక్కడ కూడా నాలుగు స్థానాలు మైనస్సే.