KTR: ఫార్మా సిటీ ద్వారా ఆ రంగంలో తెలంగాణ సుస్థిరం: మంత్రి కేటీఆర్‌తో ఫార్మా ప్రతినిధులు

  • ఫార్మా పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం
  • ఫార్మా పరిశ్రమ నిర్దేశిత కాలుష్య ప్రమాణాలు పాటించాలి
  • వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి
  • పారిశ్రామిక వాడల్లో ఆసుపత్రులు, చెరువుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి

బల్క్ డ్రగ్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ప్రతినిధులతో తెలంగాణ‌ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమావేశం అయ్యారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. భారత దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్ నగరానికి ఉన్న పేరును నిలుపుకునేందుకు అవసరం అయిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా ఫార్మా అభివృద్ధితో పాటు కాలుష్య సమస్యను పూర్తిగా అరికట్టేలా అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.

దీంతో పాటు కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలకు తరలించడంతో పాటు, క్లస్టర్ల వారీగా అయా పరిశ్రమల అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా పరిశ్రమకు ఎల్లప్పుడు చేయూత అందిస్తూ వస్తుందని మంత్రి తెలిపారు. మరోపైపు ఫార్మా కంపెనీలు నిర్దేశిత కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడదన్నారు.

పటాన్ చెరు, బొల్లారం వంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఆసుపత్రుల అప్ గ్రేడేషన్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు పరిశ్రమ వర్గాలు ముందుకు వచ్చాయి. ఈ సమావేశంలో ఫార్మా ప్రతినిధులు తమ కంపెనీల విస్తరణ ప్రణాళికలను మంత్రికి తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ ఏదుర్కుంటున్న పలు సమస్యలను, సవాళ్లను మంత్రికి వివరించారు. దీంతోపాటు తాము అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే దిశగా వెళుతున్నామని బీడీఎంఏ ప్రతినిధులు తెలిపారు.

పరిశ్రమల అభివృద్ధికి కావాల్సిన పలు చర్యలను ప్రభుత్వానికి వారు సూచించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ద్వారా ఫార్మా రంగంలో తెలంగాణ స్థానం మరింత సుస్థిరం అవుతుందని ఫార్మా ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఛీప్ అడ్వయిజర్ రాజీవ్ శర్మ, పీసీబీ సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News