Pawan Kalyan: కనీసం పాచిపోయిన లడ్డూ కూడా ఇవ్వలేదు!: కేంద్రంపై పవన్ కల్యాణ్ విమర్శలు
- పార్లమెంటులో ఇచ్చిన హామీలకు కూడా విలువ ఇవ్వట్లేదు
- హోదా ఇస్తేనే 100 శాతం న్యాయం జరుగుతుందని జేఎఫ్సీ బలమైన అభిప్రాయానికి వచ్చింది
- ఏపీలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థల కోసం నామ మాత్రంగానే నిధులు ఇచ్చారు
- ఇప్పటివరకు 5 శాతం మాత్రమే నిధులు ఇచ్చారు
ప్రత్యేకహోదా అనే పదాన్ని ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూ అని తాను గతంలో నిర్వహించిన సభల్లో చెప్పానని, పాచిపోయిన లడ్డూ అయినా తీసుకుంటామని చంద్రబాబు అన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కనీసం పాచిపోయిన లడ్డూని కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ఇస్తోన్న సాయం విషయంలో ఏం జరుగుతోందన్న అంశంపై మాత్రమే కమిటీ వేశామని తెలిపారు. ఇంత కన్ఫూజన్‌ను ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఒకసారి ప్యాకేజీని అని.. మరోసారి ప్రత్యేక హోదా అని అంటున్నారని అన్నారు.
ఏపీలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థల కోసం ఇప్పటికీ నామ మాత్రంగానే నిధులు ఇచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. 5 శాతం మాత్రమే నిధులు ఇచ్చారని, ఇన్నేళ్లలో కేవలం 5 శాతం మాత్రమే ఇవ్వడమేంటని అన్నారు. ఈ తీరు ప్రజలను మరింత ఆసహనానికి, ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ పూర్తి చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. పనులకు ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.
అలాగే, రైల్వే జోన్‌పై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఏది అడిగినా అది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం అంటోందని, మరి ఏది సాధ్యం అవుతుందో చెప్పాలని ఆయన అన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలకు కూడా విలువ ఇవ్వట్లేదని విమర్శించారు. పరిపాలనా అనుభవం ఉందని, రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీ, టీడీపీకి తాను ఎన్నికల్లో మద్దతు పలికానని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తేనే 100 శాతం న్యాయం జరుగుతందని కమిటీ బలమైన అభిప్రాయానికి వచ్చిందని తెలిపారు.