Melania Trump: అసాధారణ శక్తిసామర్థ్యాలున్న మహిళగా మెలానియా ట్రంప్.. ‘ఐన్‌స్టీన్ వీసా’ జారీ
- ఈబీ-1 ప్రోగ్రాంలో భాగంగా వీసా జారీ
- అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాను మెలానియాకు ఇవ్వడంపై వివాదం
- నోరు విప్పని ప్రథమ పౌరురాలు
అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌కు అధికారులు ‘ఐన్‌స్టీన్ వీసా’గా పిలిచే గ్రీన్ కార్డును జారీ చేశారు. ఈబీ-1 ప్రోగ్రాంలో భాగంగా మెలానియాకు గ్రీన్‌కార్డు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. సైన్స్, కళలు, విద్య, వ్యాపార రంగాలతోపాటు అథ్లెటిక్స్‌లో ‘అసాధారణ శక్తిసామర్థ్యాలు’ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ వీసాను జారీ చేస్తారు. అకడమిక్ రీసెర్చర్లు, దేశ, విదేశాల్లో కీర్తిప్రతిష్ఠలు అందుకున్న వారికే ఈ ‘ఐన్‌స్టీన్ వీసా'ను ఇవ్వడం జరుగుతుందని చట్టసభ్యులు పేర్కొన్నారు.
2006లో అమెరికా పౌరసత్వాన్ని అందుకున్న మెలానియాకు తాజాగా ఇతరులతోపాటు ఐన్‌స్టీన్ వీసాను అందజేశారు. ఇమ్మిగ్రేషన్ వీసాలపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సమయంలో మెలానియాకు ఈ వీసా జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు, అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాకు తానెలా అర్హురాలినన్న విషయాన్ని చెప్పేందుకు మెలానియా నిరాకరించారు.