BSP: యూపీలో పెను సంచలనం.. ఉప ఎన్నికల కోసం ఒక్కటైన బద్ధశత్రువులు!
- ఈనెల 11న గోరఖ్‌పూర్, ఫల్పర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు
- చేతులు కలిపిన బీఎస్పీ-ఎస్పీ
- బీజేపీని ఓడించేందుకు ఒక్కటైన శత్రువులు
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగానే చెప్పుకోవాలి. రెండు దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా ఉన్న బీఎస్పీ, ఎస్పీలు ఒక్కటయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిన మర్నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గోరఖ్‌పూర్, ఫల్పర్ లోక్‌సభ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించి సంచలనం రేపింది.
ఈనెల 11న ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడించనున్నారు. బీఎస్పీ-ఎస్పీలు దగ్గర కావడం 2015 నాటి బీహార్ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీని ఎదురొడ్డేందుకు చిరకాల శత్రువులైన జేడీయూ-ఆర్జేడీలు ఒక్కటయ్యాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను బీఎస్పీ-ఎస్పీలు అనుసరిస్తున్నాయి.
పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువున్న నేపథ్యంలో గోరఖ్‌పూర్, ఫల్పర్లో ఆదివారం ప్రచారం చేసిన బీఎస్పీ నేతలు అక్కడి ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. ఎస్పీ నేతల సమక్షంలో గోరఖ్‌పూర్, అలహాబాద్ బీఎస్పీ కోఆర్డినేటర్లు ఘన్‌శ్యామ్ కర్వార్, అశోక్ గౌతమ్‌లు ఈ ప్రకటన చేశారు.
అయితే ఈ ప్రకటనపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ బీఎస్పీ-ఎస్పీ మధ్య ఎటువంటి పొత్తు ఉండబోదని, అయితే బీజేపీతో పోరాడే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని మనసులోని మాటను బయటపెట్టారు.
మరోవైపు, వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎస్పీ మద్దతు ఇచ్చే అంశంపైనే తాజా పరిణామాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తే ఏప్రిల్‌లో జరగనున్న లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతు ఇస్తామని మాయావతి తెలిపారు.