Abbott: ఆస్ట్రేలియా ఆటగాడి మరణానికి కారణమైన బౌలరే మళ్లీ మరో బ్యాట్స్ మేన్ ని కుప్పకూల్చాడు.. ఈసారి ప్రమాదం తప్పింది!
- మూడేళ్ల తర్వాత సేమ్ టోర్నీ, సేమ్ బౌలర్
- అబాట్ వేసిన బౌన్సర్‌కు ఆసీస్ ఆటగాడు విలవిల
- మరోమారు షాక్‌కు గురైన క్రికెట్ ప్రపంచం
- పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ఆటగాళ్లు
ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ మరోమారు బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. నవంబరు, 2014లో అబాట్ వేసిన బంతి తలకు తగిలి కుప్పకూలిన ఆసీస్ టెస్ట్ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్కు ఆపరేషన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత అతడు ప్రాణాలు వదిలాడు. క్రికెట్ చరిత్రలో ఇదో దుర్దినంగా చెబుతారు. ఇప్పటికీ ఈ విషాదం వెంటాడుతుండగా తాజాగా, అదే టోర్నీలో, అదే బౌలర్ విసిరిన షార్ట్ పిచ్ బంతికి మరో బ్యాట్స్‌మన్ బాధతో కుప్పకూలాడు. అయితే క్షణాల్లోనే వైద్యం అందడంతో అతడి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనతో ఆసీస్ క్రికెటర్లు మరోమారు ఆందోళనకు గురయ్యారు.
దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూసౌత్ వేల్స్ తరపున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ అబాట్ వేసిన షార్ట్‌పిచ్ బంతి బ్యాట్స్‌మన్ పకోవ్‌స్కీ తలకు బలంగా తాకడంతో బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలాడు. వెంటనే స్పందించిన అబాట్ అదే వేగంతో బ్యాట్స్‌మన్ వద్దకు వచ్చి అతడిని కిందపడకుండా పట్టుకునే ప్రయత్నం చేశాడు.
పకోవ్‌స్కీ దాదాపు స్పృహ తప్పడంతో వెంటనే మైదానంలోకి చేరుకున్న వైద్య సిబ్బంది చికిత్స అందడంతో కొంచెం సేపటి తర్వాత అతడు కోలుకున్నాడు. అయినప్పటికీ నిలబడడానికి ఇబ్బంది పడుతుండడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ ఘటనతో ఆదివారం క్రికెట్ ప్రపంచం మరోమారు షాక్‌కు గురైంది. మళ్లీ ఎక్కడ దుర్వార్త వినాల్సి వస్తోందనని ఆందోళన చెందింది. అయితే పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.