Uttar Pradesh: హోలీ ఏడాదికి ఒక్కసారే... నమాజ్ రోజూ ఉంటుంది: తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు
- ఫుల్ పూర్ ఎన్నికల ప్రచారంలో యోగి
- ర్యాలీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు
- విమర్శిస్తున్న కాంగ్రెస్, ఎస్పీ
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సంవత్సరంలో హోలీ పండగ ఒక్కసారి మాత్రమే వస్తుందని, ఆ పండగను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెబుతూ, నమాజ్ ప్రతి రోజూ ఉంటుందని, దాన్ని చాలాసార్లు చదువుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు. హోలీ గురించి మాట్లాడుతూ, నమాజ్ ప్రస్తావన తేవడం ఎందుకని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11న ఉప ఎన్నికలు జరగనున్న ఫుల్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటిస్తున్న ఆయన, ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, యూపీలో నమాజ్ జరిగే సమయంలోనే హోలీ ర్యాలీ సాగుతుండటం, ఆ సమయంలో నమాజ్ కు వెళ్లే వారిపై గులాల్ చల్లడం, ఆపై జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో ఈ సంవత్సరం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో శుక్రవారం నమాజ్ సమయాన్ని 30 నిమిషాల నుంచి గంట వరకూ వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని లక్షలాది మంది ప్రజలు స్వాగతించారు కూడా. అయితే, దాన్ని ప్రస్తావిస్తూ, యోగి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాక రేపుతున్నాయి. ఆదిత్యనాథ్ ఇలా మాట్లాడటం మత ఉద్రిక్తతలను పెంచుతుందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.