Andhra Pradesh: ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వాల్సిందే: ఏపీ అసెంబ్లీలో గవర్నర్
- ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
- రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వెల్లడి
- దాన్ని చల్లార్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోన్ లపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు కావాల్సిందేనని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ 2018-19 బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగా, ఉభయ సభలనూ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విభజన చట్టంలోని ఎన్నో హామీలు అమలు కావాల్సి వుందని వెల్లడించిన ఆయన, విభజన గాయాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని అన్నారు.
విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. ఆస్తులను ప్రాంతాల వారీగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని గుర్తు చేసిన ఆయన, తన ప్రభుత్వం మూడున్నరేళ్లుగా హామీల అమలు కోసం ప్రయత్నం సాగిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఎంతో అసంతృప్తి నెలకొని ఉందని, అది తొలగాలంటే, కేంద్రం చొరవ చూపించాల్సిందేనని నరసింహన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత అన్న మాట లేకుండా చేయగలిగామని ఆయన అన్నారు.
గత సంవత్సరం 11.31 శాతం వృద్ధి రేటును సాధించామని వెల్లడించిన ఆయన విభజన హామీల అమలుపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి ఇంకా రాజధాని ఏర్పడలేదని, ప్రధాన ఆర్థిక వనరులను కోల్పోయామని, రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయం, ఆస్తుల పంపిణీ పూర్తికాకపోవడంతో కొత్త రాష్ట్రానికి కష్టాలు మరింతగా పెరిగాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ లో సూచించిన విధంగా ఆస్తుల పంపిణీ చేపట్టాలని కోరారు. కేంద్ర నిధులతో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వుందని అన్నారు.
రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, అవమాన భారంతో ఆగ్రహంగా ఉన్నారని, కష్టాలు తీర్చి, ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నదని నరసింహన్ అభిప్రాయపడ్డారు. అమరావతికి ఆర్థిక సహాయం, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థల ఏర్పాటుకు త్వరితగతిన కృషి చేయాలని గవర్నర్ సూచించారు. అసెంబ్లీలో సీట్ల పెంపు, పన్ను విధింపు విషయాల్లో తేడాలను పరిష్కరించాల్సి వుందని అన్నారు.