JC Diwakar Reddy: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ లో ఎంపీ జేసీ ప్రధాన అనుచరుడు... సురేశ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు!
- గతంలో జేసీకి పీఏగా పనిచేసిన సురేష్ రెడ్డి
- ఆపై పంచాయితీ రాజ్ శాఖలో అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్
- అప్పటి నుంచి జేసీకి అనుచరుడిగా సురేష్
క్రికెట్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై అనంతపురం ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొండసాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. గతంలో చాలాకాలం పాటు జేసీకి అధికారిక పీఏగా పని చేసిన సురేష్ రెడ్డి, ఇప్పుడు ఆయన వెంటే అనుచరుడిగా ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడిని విచారించిన పోలీసులు, ఆయన ఇచ్చిన సమాచారంతోనే సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, జేసీకి పీఏగా పనిచేసిన తరువాత, పంచాయితీ రాజ్ శాఖలో ఇంజనీర్ గా పని చేస్తూ సురేష్ ఇటీవల సస్పెన్షన్ కు గురయ్యారు. జేసీ పేరిట ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించాడని, భూకబ్జాలకు పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడం వెనుక ఆయన హస్తముందన్న ఆరోపణలూ ఉన్నాయి.