loksabha adjourned: ప్రతిపక్షాల నిరసనల ధాటికి లోక్ సభ సమావేశాలను రేపటికి వాయిదా వేసిన స్పీకర్
- ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీల పట్టు
- బ్యాంకుల్లో భారీ స్కాములపై కాంగ్రెస్, ఇతర పక్షాల రాద్దాంతం
- ప్రధాని సమాధానం కోసం డిమాండ్
ప్రతిపక్షాల నిరసనలు, నినాదాలతో లోక్ సభ దద్దరిల్లిపోయింది. దీంతో స్పీకర్ రేపటికి వాయిదా వేసి వెళ్లిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 12,700 కోట్ల రూపాయల భారీ స్కామ్ వెలుగు చూడడంతో ప్రతిపక్షాలు దీన్ని ఓ అవకాశంగా తీసుకున్నాయి. నేటి నుంచి బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం కాగా, మొదటి రోజే ఉభయ సభల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా, ఇతర బ్యాంకుల్లో స్కాములపై ప్రధాని సమాధానం కోసం డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వీటిని నివారించడంలో ఎందుకు విఫలమైందని నిలదీశారు. దీంతో సభా కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. తొలుత టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో చేసిన నినాదాలకు స్పీకర్ 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభలో పరిస్థితి మారలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ రేపటికి సభా సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.