manikya varaprasad: 19 అంశాలను కేంద్ర సర్కారు పరిష్కరించాలి.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
- 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు కృషి చేస్తున్నారు
- ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ వినూత్నరీతిలో ప్రసంగించారు
- రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వ తీరుని గవర్నర్ అభినందించారు
- వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి బాగోలేదు
రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన 19 అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఈ రోజు ఆయన మాట్లాడుతూ... 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఉభయసభల నుద్దేశించి గవర్నర్ నరసింహన్ వినూత్నరీతిలో ప్రసంగించారని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వ తీరుని ఆయన అభినందించారన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి బాగోలేదని, పాదయాత్రకంటే శాసనసభ పవిత్రమైందని ఆయన అన్నారు. ఏ సమస్యనైనా సభలో చర్చించి పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో ప్రతిపక్షం పునరాలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తోందని అన్నారు.
తానూ దళిత కులానికి చెందినవాడినేనని, ఉన్నత కులాలవారు ఎవరూ తనని ఎప్పుడూ
తక్కువగా చూడలేదని డొక్కా తెలిపారు. ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలసి పనిచేశానని, వాళ్లు ఇంట్లో మనిషిలా, సొంత తమ్ముడిలా చూసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను సొంత తమ్ముడిలా గౌరవిస్తారన్నారు. లోకేశ్ తనను అన్నగా భావిస్తారని చెప్పారు.