Karnataka: ఉపేంద్ర సంచలన నిర్ణయం.. సొంత పార్టీని మూసేసి బీజేపీలో చేరనున్న కన్నడ నటుడు?
- సొంతపార్టీ కేపీజేపీలో అసంతృప్తి
- ఉపేంద్రపై నేతల తిరుగుబాటు
- నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సూపర్ స్టార్
- జోరుగా ఊహాగానాలు
సొంత పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర పార్టీని మూసేసి బీజేపీలో చేరబోతున్నారా?.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం కావడం, తనపై తిరుగుబాటుకు కొందరు పావులు కదుపుతుండడంతో పార్టీని రద్దు చేసి, బీజేపీలో చేరాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇందుకు మరింత బలాన్ని ఇస్తోంది.
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన ఉపేంద్ర గతేడాది సొంత పార్టీ ‘కర్ణాటక ప్రజ్ఞాయవంత జనతా పార్టీ’(కేపీజేపీ) ని ప్రకటించారు. అయితే, ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఆయన ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు నేతలు ఆయనపై తిరుగుబాటు ప్రారంభించారు. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ .. ఉపేంద్ర పెద్ద సినీ నటుడైతే కావొచ్చేమో కానీ పార్టీలో మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయన ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తామేం చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదని, ఉపేంద్రపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.
పార్టీ మూసేస్తారన్న వ్యాఖ్యలను ఉపేంద్ర ప్రతినిధి ఆనంద్ ఖండించారు. ఆయనంటే గిట్టని వారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. శివకుమార్ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపడేశారు. రాజకీయాల్లో మార్పు రాత్రికి రాత్రే వచ్చేది కాదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కాగా, తాజాగా ఉపేంద్ర ట్వీట్ చేస్తూ మార్చి 6న తాను అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం (నేడు) ఆయన బీజేపీలో చేరబోతున్నారని, ఆ ట్వీట్ అర్థం అదేనని విశ్లేషిస్తున్నారు.