Mulayam singh Yadav: శ్రీరాముడు చెప్పాడట! ములాయం రావణుడు.. మాయావతి ఆయన సోదరి శూర్పణఖ.. యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- ములాయం కుటుంబాన్ని రామాయణంలోని పాత్రలతో పోల్చిన మంత్రి
- ఈ విషయాన్ని రాముడే చెప్పాడని వ్యాఖ్యలు
- వెల్లువెత్తుతున్న విమర్శలు
- కేబినెట్ నుంచి తొలగించాలని ఎస్పీ, బీఎస్పీ డిమాండ్
ఉత్తరప్రదేశ్ పౌర విమానయాన మంత్రి నంద్ గోపాల్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలియుగ రావణుడిగా, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని శూర్పణఖగా అభివర్ణించి వివాదం రేపారు. అలహాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
నంద్ గోపాల్ మాట్లాడుతూ.. ‘‘కలియుగంలో రావణుడు ములాయం సింగ్‌గా, ఆయన సోదరి శూర్పణఖ మాయావతిగా పుడతారు. వారు ముఖ్యమంత్రులు కూడా అవుతారని శ్రీరాముడు చెప్పాడు’’ అని పేర్కొన్నారు.
మంత్రి అక్కడితో ఆగకుండా సమాజ్‌వాదీ పార్టీ నేతలైన శివపాల్ యాదవ్‌ను కుంభకర్ణుడి (రావణుడి సోదరుడు) గా, అఖిలేశ్ యాదవ్‌ను మేఘనాథుడి (రావణుడి కుమారుడు) గా అభివర్ణించారు. ‘‘మేఘనాథుడా.. నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రివి అయ్యావు’’ అని మంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
మంత్రి అక్కడితోనూ ఆగకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ను రావణుడి మేనమామ మారీచుడితో పోల్చారు. ప్రధాని నరేంద్రమోదీ రాముడని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడిని మంత్రి అభివర్ణించారు.
మంత్రి వ్యాఖ్యలపై ఎస్పీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు మంత్రి మానసిక స్థితిని తెలుపుతున్నాయని విమర్శించారు. వారిది గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే భావజాలమని దుమ్మెత్తి పోశారు. వారు నిన్ననే ఎస్పీ, బీఎస్పీలను పాము, ముంగిసగా పోల్చారని గుర్తు చేశారు.
గుప్తాను కేబినెట్ నుంచి తొలగించాలని బీఎస్పీ అధికార ప్రతినిధి ఉమ్మెద్ సింగ్ డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.