Hyderabad: చిన్నతప్పుకి పెద్ద శిక్ష... కొడుకు చెయ్యినరికేసిన తండ్రి
- చెడుసావాసాలతో అశ్లీల దృశ్యాలు చూసేందుకు అలవాటుపడ్డ మహ్మద్ ఖాలెద్ ఖురీషీ
- బుద్ధిమార్చుకొమ్మని పలుమార్లు హెచ్చరించిన తండ్రి
- ఎలా చెప్పినా వినకపోవడంతో చేయినరికేసి బుద్ధి చెప్పిన తండ్రి
హైదరాబాదులోని పాతబస్తీలో కొడుకు చేసిన చిన్నతప్పుకి పెద్దశిక్ష విధించాడో తండ్రి. దాని వివరాల్లోకి వెళ్తే... పహాడీషరీఫ్ జల్ పల్లి ప్రాంతంలో ఉండే ఖయ్యుం ఖురేషి మాంసం వ్యాపారి. చెడుసావాసాలు చేస్తున్న తన పెద్ద కుమారుడు మహ్మద్ ఖాలెద్ ఖురేషీ (18) ని బాధ్యతగల పౌరుడిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. దీంతో స్థానిక కేబుల్ టీవీ కార్యాలయంలో పనికి కుదిర్చాడు. బుద్ధిగా పని చేసుకోవాలని సూచించాడు.
అయితే అస్తమానూ ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తుండటాన్ని గుర్తించిన తండ్రి ఖాలెద్ ను మందలించాడు. బుద్ధిగా పని చేసుకోవాలని సూచించాడు. తండ్రి మాటలు పట్టించుకోని ఖాలెద్, పని మానేసి అశ్లీల దృశ్యాలు చూస్తుండడాన్ని గుర్తించి, ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో తండ్రి చేయి కొరికి, ఫోన్ తీసుకుని ఖాలెద్ పారిపోయాడు. ఆరోజు నుంచి వారింట్లో గొడవ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ మనసు మార్చుకోని ఖాలెద్ మళ్లీ అదే పని చేస్తుండడంతో...తీవ్ర ఆగ్రహానికి గురైన ఖయ్యూం పక్కనే ఉన్న మాంసం నరికే కత్తితో కుమారుడి కుడి చేతిని నరికేశాడు. ఖాలెద్ అరుపులతో పరుగెత్తుకొచ్చిన తల్లి లబోదిబోమంటూ కుమారుడ్ని స్థానికుల సాయంతో ఆసుపత్రిలో చేర్పించింది. ఖయ్యుం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.