yogi adityanath: నేడు దేశంలో ఉన్నది ఒక్కటే ఓటు బ్యాంకు... అదే మోదీ ఓటు బ్యాంకు: యోగి ఆదిత్యనాథ్
- కులం, ప్రాంతం వారీ ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లింది
- ఎస్పీ, బీఎస్పీ మధ్య అపవిత్ర బంధం
- ప్రజల మనోభావాలను అవహేళన చేయడమే
- ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం విమర్శనాస్త్రాలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి మోదీ నామ స్మరణ చేశారు. ఆ రాష్ట్రంలోని ఫూల్పూర్, గోరక్ పూర్ లోక్ సభ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఆరు ర్యాలీల్లో ఆదిత్యనాథ్ పాల్గొని అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలో ప్రచారానికి వెళ్లనున్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన గోరక్ పూర్ లోక్ సభ స్థానం ఖాళీ అయింది. ఇక్కడి నుంచి యోగి ఐదు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
ఉప ఎన్నికలు జరిగే రెండు స్థానాల్లోనూ ఎస్పీ, బీఎస్పీ పరస్పర సహకారంతో ముందుకు వెళ్లనున్నట్టు వచ్చిన వార్తలపై ప్రచారంలో భాగంగా యోగి స్పందించారు. ఉప ఎన్నికల్లో వీరి పొత్తు ఎటువంటి ప్రభావం చూపించదన్నారు. ‘‘దేశంలో ఒకటే ఓటు బ్యాంకు ఉంది. అది మోదీ ఓటు బ్యాంకు. కులం, ప్రాంతం ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లింది. ఎస్పీకి బీఎస్పీ సహకారం అందించడం పొత్తు కాదు. అదో ఒప్పందం. అపవిత్ర ఒప్పందం. ప్రజల మనోభావాలను అవహేళన చేయడం’’ అంటూ యోగి ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించారు.