Manohar Parikar: గోవా పాలనను ముగ్గురు మంత్రులకు అప్పగించిన పారికర్
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి
- చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయం
- ఆరోగ్య సమస్య ఏమిటన్న విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, తదుపరి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గోవా పాలనా బాధ్యతలను ముగ్గురు మంత్రులకు అప్పగించారు. గత నెలలో దాదాపు రెండు వారాలకు పైగా ముంబైలో తన అనారోగ్యానికి చికిత్స చేయించుకున్నప్పటికీ, స్వస్థత చేకూరలేదన్న సంగతి తెలిసిందే. గత వారంలో మరోసారి ముంబైకి వెళ్లిన ఆయన, ఇక విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటన్నది మాత్రం బీజేపీ శ్రేణులు బయట పెట్టడం లేదు.
కాగా, ఫిబ్రవరి 15 న తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న సంగతి విదితమే. ఆపై గోవా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన, రెండు రోజుల్లోనే అంటే, ఫిబ్రవరి 25న మళ్లీ గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆ సమయంలో పారికర్ డీ హైడ్రేషన్, లో బీపీతో బాధ పడుతున్నట్టు వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని సీఎం కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 1న హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఆయన, ఆపై మరో రెండు రోజుల వ్యవధిలో ముంబైకి వెళ్లాల్సి వచ్చింది.