Jagan: జగన్ కు పిచ్చెక్కి రోడ్లపైకి వచ్చారు.. వైయస్ కుటుంబానికి ఓటమి శకం ప్రారంభమైంది: వీరశివారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • జగన్ అసమర్థతతో ఆ కుటుంబ పతనం ప్రారంభమైంది
  • ఓటమే ఎరుగని వివేకానందరెడ్డి కూడా ఓడిపోయారు
  • అధికారం దాహంతో జగన్ కు పిచ్చెక్కింది

వైయస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం రాజకీయ చరిత్రలో ఆ కుటుంబానికి ఓటమనేదే తెలియదని... అయితే, జగన్ చేతకాని తనం వల్ల ఓటమి శకం ప్రారంభమైందని టీడీపీ నేత వీరశివారెడ్డి అన్నారు. వైయస్ మరణానంతరం వ్యాపారరంగం నుంచి రాజకీయాల్లోకి జగన్ వచ్చారని... ఆయన అసమర్థ రాజకీయాలతో వారి రాజకీయ కోట బీటలువారుతోందని ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల్లో విశాఖ నుంచి విజయమ్మను పోటీ చేయించారని.. అయితే, పులివెందుల సంస్కృతి వస్తుందనే భయంతో... అక్కడి ప్రజలు విజయమ్మను తిప్పికొట్టారని శివారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సామాన్యుడి చేతిలో... ఓటమే ఎరుగని వైయస్ వివేకానందరెడ్డి ఓడిపోయారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారని... అయితే, జగన్ అసమర్థత కారణంగా 23 మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ నుంచి దూరంగా వచ్చేశారని ఎద్దేవా చేశారు.

అధికార దాహంతో జగన్ కు పిచ్చిపట్టిందని, అందుకే రోడ్లపై తిరుగుతున్నారని వీరశివారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రతిపక్ష నేత... పిచ్చిపట్టినట్టు రోడ్లపై తిరగడమేంటని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను సభలో చర్చించకుండా, రోడ్లపై తిరగడం... ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. అవినీతి, అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడిన జగన్... రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై జగన్ కు చిత్తశుద్ధి ఉంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News