Chandrababu: బీజేపీని నిలదీసే పరిస్థితి వస్తుంది.. మేము సీరియస్గా అడుగుతున్నాం: చంద్రబాబు
- ఏపీకి అన్యాయం జరిగిందనే బాధ ప్రజల్లో ఉంది
- ఆరోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది
- ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీకి చెప్పాను
- పోలవరం కోసం రాష్ట్రం పెట్టిన ఖర్చులో ఇంకా రూ.3100 కోట్లు రావాలి
ఏపీకి అన్యాయం జరిగిందనే బాధ ప్రజలందరిలోనూ ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని, ఈ రోజు బీజేపీ ఎందుకు అన్యాయం చేస్తోందని నిలదీసే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటివరకు 29 సార్లు తాను ఢిల్లీకి వెళ్లానని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీకి చెప్పానని తెలిపారు.
పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. పోలవరం భూసేకరణకు రూ.32 వేల కోట్లు అవుతోందని, పోలవరం కోసం రాష్ట్రం పెట్టిన ఖర్చులో ఇంకా రూ.3100 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. నిన్న సాయంత్రం కూర్చొని మాట్లాడతామని బీజేపీ అధిష్ఠానం చెప్పిందని అన్నారు.
అయితే, ఏపీకి ప్రత్యేక ప్రయోజనాలను అందించడంపై సానుకూలత కనపడలేదని చంద్రబాబు అన్నారు. ప్రజల మనోభావాలను కాపాడాలని, లా అండ్ ఆర్డర్ని కాపాడాలని అన్నారు. రాష్ట్రానికి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వాన్ని సీరియస్గా అడుగుతామని అన్నారు.