h.raja: ఇవాళ లెనిన్ విగ్రహం.. రేపు కుల తీవ్రవాది పెరియార్.. అంటూ అగ్నికి ఆజ్యం పోసిన బీజేపీ!
- రామస్వామి నాయకర్ విగ్రహాన్ని తొలగించాలంటూ రాజా ట్వీట్
- తమిళ రాజకీయాల్లో చెలరేగిన అలజడి
- రామస్వామి విగ్రహాన్ని టచ్ చేసి చూడమంటూ వార్నింగ్
ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగిరిందన్న ఆనందంలో బీజేపీ శ్రేణులు మునిగితేలుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలను కూడా పెంచి పోషిస్తున్నాయి. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే... లెనిన్ విగ్రహాన్ని కూల్చేశారు. ఈ అంశంపై రచ్చ కొనసాగుతుండగానే... తమిళనాడుకు చెందిన బీజేపీ నేత హెచ్.రాజా చేసిన ట్వీట్ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసింది. 'అసలు లెనిన్ ఎవరు? ఇండియాతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? త్రిపురలో ఆయన విగ్రహాన్ని తొలగించాల్సిందే. ఇవాళ త్రిపురలో లెనిన్... రేపు కుల తీవ్రవాది రామస్వామి నాయకర్' అంటూ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజా వ్యాఖ్యలపై తమిళనాడులో రాజకీయ వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలను తమిళ పార్టీలు తప్పుబట్టాయి. రాజాను వెంటనే అరెస్ట్ చేయాలని... గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పెరియార్ విగ్రహాన్ని టచ్ చేస్తే... తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. అయితే, తన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగడంతో... తన ట్వీట్ ను హెచ్.రాజా తొలగించారు.