KCR: బలమైన సంకేతాలు... కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లోకి చంద్రబాబు కూడా!
- 2019 నాటికి తృతీయ కూటమి
- కసరత్తు చేస్తున్న కేసీఆర్
- ఇప్పటికే ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్న చంద్రబాబు
- ఇక బీజేపీతో తెగదెంపులకు సిద్ధమైనట్టేనంటున్న రాజకీయ పరిశీలకులు
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ, కాంగ్రసేతర తృతీయ కూటమిని సిద్ధం చేయాలన్న దిశగా కసరత్తు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటికే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అజిత్ జోగి, స్టాలిన్ తదితరుల నుంచి మద్దతు రాగా, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కేసీఆర్ కు మద్దతు పలికే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్ లో చంద్రబాబు భాగస్వామి కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒకేసారి బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నిప్పులు చెరగడం ప్రారంభించారు. బీజేపీ తమ రాష్ట్రాలకు చేసిందేమీ లేదన్నది ఇద్దరు నేతల అభిప్రాయం.
ఇక 2014 ఎన్నికలకు ముందు కుదిరిన బీజేపీ - టీడీపీ కూటమి గోడలు ఇప్పుడు బీటలు వారుతున్నాయి. స్వయంగా చంద్రబాబునాయుడే బీజేపీ వైఖరిపై నిప్పులు చెరుగుతున్న పరిస్థితి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ కోసం వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు, ప్రజలు నిరసనలతో రోడ్డెక్కడంతో, ఇంతవరకూ హోదా కన్నా ప్యాకేజీ గొప్పగా ఉంటుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు హోదా నినాదాన్ని ఎత్తుకోక తప్పలేదు. అసలు చంద్రబాబు నోటివెంట ప్రత్యేక హోదా నినాదం వచ్చిందంటేనే బీజేపీతో తెగదెంపులకు ఆయన సిద్ధమైపోయినట్టే అన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఇక కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లోకి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, డీఎంకే తదితర పార్టీలు వస్తే, తెలుగుదేశం కూడా చేరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.