petrol: వాహనదారులు బెంబేలు.. వరుసగా ఆరో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు
- రూపాయి విలువ, సుంకాలతో ఆకాశాన్నంటుతున్న ధరలు
- బెంబేలెత్తుతున్న వాహనదారులు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం, డిమాండ్ కూడా పెరుగుతుండటంతో... మన దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు కూడా పెరిగాయి. మెట్రో సిటీలలో లీటర్ పెట్రోల్ రూ. 80కి చేరువవుతోంది. డీజిల్ ధరలు సైతం రూ. 67కు చేరుకున్నాయి. జనవరి 24న పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయిని తాకాయి. అప్పటి నుంచి ఈ పెరుగుదల కొనసాగుతూనే ఉంది.
ముడి చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్) చమురు ఉత్పత్తులను నియంత్రణలో ఉంచడంతో... ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ, పెట్రో ఉత్పత్తులపై సుంకాలతో పెట్రో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు, పెట్రో ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో, పెట్రోల్ పై వ్యాట్, ఇతర పన్నులను తగ్గించాలని రాష్ట్రాలను కేంద్రం కోరుతోంది.