Pawan Kalyan: నా వద్దకు కూడా ఐటీ అధికారులను పంపించారు.. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ప్రయోజనం లేదు: పవన్ కల్యాణ్

  • నేను ఢిల్లీకి వెళ్లి ఫైట్ చేసినా ప్రయోజనం లేదు
  • 2014లో నన్ను వాడుకుని వదిలేశారు
  • ఉత్తర, దక్షిణ భారత్ మధ్య తేడాలొస్తాయని మోదీకి చెప్పా

రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు నేతలంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేసులున్నాయని టీడీపీ, వైసీపీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. తన వద్దకు కూడా ఐటీ అధికారులను పంపించారని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ అంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసమని అందరూ అనుకుంటున్నారని... ప్రాంతీయ పార్టీలు స్వతంత్రంగా వ్యవహరించడానికే థర్డ్ ఫ్రంట్ అని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రత్యేక హోదాపై మాట్లాడిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్లు జల్లుతున్నాయని పవన్ చెప్పారు. అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం మంచి పరిణామమని అన్నారు. 2014లో తనను వాడుకుని వదిలేశారని అనుకుంటున్నానని... 2019లో తన వైఖరి ఏంటో గుంటూరు సభలో చెబుతానని తెలిపారు. కేంద్ర మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తే వస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

తాను ఢిల్లీకి వెళ్లి, పోరాటం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని పవన్ చెప్పారు. మాఫియా లీడర్లు మాట ఇస్తే నిలబడతారని... కానీ, రాజకీయ నాయకులు మాట మీద కూడా నిలబడరని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుంటే ఉత్తర, దక్షిణ భారత్ లో తేడాలు వస్తాయనే విషయాన్ని గతంలోనే ప్రధాని మోదీకి వివరించానని తెలిపారు. హోదాను సాధించడానికి జేఏసీలాంటిది అవసరమని చెప్పారు. గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమకారులు పోరాడిన విధంగా పోరాడాలని సూచించారు.

  • Loading...

More Telugu News