Hyderabad: త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చడంపై.. హైదరాబాద్లో సీపీఎం, సీపీఐ ఆందోళన
- మండిపడ్డ వామపక్ష నేతలు
- ఈ ఘటన సంఘ్ పరివార్ శక్తుల నిరంకుశత్వానికి నిదర్శనం
- వామపక్ష పార్టీల కార్యాలయాలపై కూడా సంఘ్ పరివార్ దాడులు
- బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు
త్రిపురలో వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని కూల్చిన ఘటనపై వామపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన సంఘ్ పరివార్ శక్తుల నిరంకుశత్వానికి నిదర్శనమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఈ ఘటనకు నిరసనగా ఈ రోజు ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు హైదరాబాద్లోని బషీర్ బాగ్ కూడలిలో నిరసన తెలిపి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వామపక్ష పార్టీల కార్యాలయాలపై కూడా సంఘ్ పరివార్ దాడులు చేస్తోందని వామపక్ష నేతలు ఆరోపించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే విగ్రహాలను కూల్చివేస్తోందని అన్నారు. నిందితులను అరెస్టు చేయకపోతే, తాము దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని అన్నారు.