Chandrababu: వేరే రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడంలేదు.. మూడు సందర్బాల్లో కేంద్రాన్ని నిలదీశా: అసెంబ్లీలో చంద్రబాబు
- రాష్ట్రాలకు హోదా కింద ఇస్తున్న నిధులు మాక్కూడా ఇవ్వాల్సిందే
- బీజేపీ ఎదురుదాడికి దిగితే.. ప్రజలు క్షమించరు
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు
ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయ శ్రేణుల్లోని రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలను ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తాను ఎన్నడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు హోదా ద్వారా ఇస్తున్న సౌకర్యాలను అన్నింటినీ ఏపీకి ఇవ్వాలని ఆనాడే స్పష్టంగా చెప్పానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిశామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీల నుంచి బీజేపీ నేతలు తప్పించుకోలేరని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు హోదా కింద ఇచ్చే నిధులను ఏపీకి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. విభజన నష్టాలను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చెప్పారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి, ఎదురుదాడికి దిగితే ప్రజలు క్షమించబోరని అన్నారు. మూడు కీలక సందర్భాలలో హోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరు... ఏంటి ఈ పరిస్థితి? అని కేంద్రాన్ని తాను నిలదీశానని చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిందేనని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.