Chandrababu: రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు: అసెంబ్లీలో చంద్రబాబు
- పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నీతి అయోగ్ సిఫారసు చేసింది
- మనం ఖర్చు పెట్టిన దాంట్లో ఇంకా రూ.2568 కోట్లు రావాల్సి ఉంది
- రూ.4,932 కోట్లకు లెక్కలను పోలవరం అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాం
- రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చారు వాటికి లెక్కలు అందజేశాం
రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక రాజధానికి ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారని, వాటికి ఇప్పటికే లెక్కలు పంపామని తెలిపారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని ఇక్కడి నుంచి మరోసారి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని అప్పట్లో నీతి అయోగ్ సిఫారసు చేసిందని చంద్రబాబు అన్నారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో ఇంకా రూ.2,568 కోట్లు రావాల్సి ఉందని, ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన వాటిల్లో రూ.4,932 కోట్లకు లెక్కలను పోలవరం అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపామని అన్నారు. పోలవరం అథారిటీకి ఎప్పటికప్పుడు అన్ని వివరాలు ఇస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసుకోవాలని అన్నారు.