BJP: విగ్రహాల విధ్వంసంలో పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవు: బీజేపీ అధినేత అమిత్ షా
- ఈ ఘటనలు చాలా దురదృష్టకరం
- విగ్రహాలు ఎవరివైనా వాటిని ధ్వంసం చేయడాన్ని సహించం
- విగ్రహాల విధ్వంస ఘటనలపై స్పందించిన అమిత్ షా
త్రిపుర, తమిళనాడు రాష్ట్రాల్లో విగ్రహాల విధ్వంసం ఘటనలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. త్రిపురలో లెనిన్, తమిళనాడులో పెరియార్ విగ్రహాల కూల్చివేత ఘటనలు చాలా దురదృష్టకరమైన విషయమని, ఇలాంటి ఘటనల్లో పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారతదేశం భిన్న సిద్ధాంతాలు, ఆలోచనలకు నిలయమని, అంతా కలిసికట్టుగా ఉండాలనే సిద్ధాంతాన్ని తమ పార్టీ బలంగా నమ్ముతుందని అన్నారు. విగ్రహాలు ఎవరివైనా వాటిని ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం వంటి చర్యలను సహించమని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా, త్రిపుర, తమిళనాడుతో పాటు తాజాగా, యూపీలోని మీరట్ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన విషయం వెలుగులోకి వచ్చింది.