Telugudesam: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి జిల్లా కోర్టులో చుక్కెదురు!
- మంత్రి పై దాడి కేసులో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు
- కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయడం కుదరదన్న జిల్లా కోర్టు
- హైకోర్టును ఆశ్రయించనున్న చింతమనేని?
నాడు మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్ పై దాడి కేసులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమడోలు కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏలూరులోని జిల్లా కోర్టును చింతమనేని ఆశ్రయించారు. తనకు విధించిన జైలు శిక్షను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను జిల్లా కోర్టు తిరస్కరించింది.
శిక్షను రద్దు చేయడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చింతమనేని హైకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. కాగా, ఈ దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ భీమడోలు కోర్టు గత నెల 14న తీర్పు నిచ్చింది.