Jagan: చంద్రబాబు తలొగ్గినందుకు సంతోషం... కానీ ఇంకా ఎన్డీయేలో ఉంటానని చెప్పడంలో అర్థమేంటి?: వైఎస్ జగన్
- రాజీనామాలకు ముందు ఆ విషయం బీజేపీ పెద్దలతో డిస్కస్ చేయం ఏంటి?
- చంద్రబాబువి పూటకో మాట, రోజుకో పాట
- ఆయన ఆలోచనలకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే వస్తాయి
- నీతి, నిజాయతీ, విశ్వసనీయత లేని నేత చంద్రబాబు
ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో కేంద్రం నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, ప్రజాగ్రహాన్ని చూసి తలొగ్గారని, ఆ విషయం సంతోషకరమే అయినప్పటికీ, తనకు ఇంకో విషయం ఆశ్చర్యాన్ని కలిగించిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, రాజీనామాలకు ముందు ఆ విషయాన్ని తాను కేంద్ర పెద్దలకు వెల్లడించనున్నట్టు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు.
"రాజీనామాలు చేద్దామని అనుకున్నప్పుడు... మళ్లీ ఫోన్ లో మాట్లాడటం ఎందుకండీ? ఢిల్లీ పెద్దలతో ఫోన్ లో మాట్లాడాను అని ఆయనంతట ఆయనే ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ ఉంటే అర్థమేంటి? ఎన్డీయే కన్వీనర్ గా ఆయన ఇంకా కొనసాగుతున్నాడంటే ఆర్థమేంటి? ఇంకా ఎన్డీయేలో ఉంటానని చెప్పడంలో అర్థమేంటి? దేనికైనా చిత్తశుద్ధి... రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ, నిజాయతీ చాలా ఇంపార్టెంట్. చంద్రబాబునాయుడికి ఇవేమీ లేవు కాబట్టి, పూటకో మాట, రోజుకో పాట పాడుతూ ఉన్నారు. తాను ఏం చేసినాగానీ ప్రజలు పడుంటారన్న చంద్రబాబు థింకింగ్ కు చరమగీతం పాడే రోజులు కూడా త్వరలోనే వస్తాయి" అని అన్నారు.