Love jihad: కేరళ 'లవ్ జీహాద్' కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • కేరళ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన అత్యున్నత న్యాయస్థానం
  • హదియా-జహాన్ వివాహాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు
  • విచారణ పేరుతో హదియా జీవితంలో తలదూర్చవద్దని ఎన్ఐఏకి ఆదేశం

కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేరళ 'లవ్ జీహాద్' కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు హదియా పెళ్లి చెల్లదంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. సఫిన్ జహాన్‌తో హదియా వివాహాన్ని పునరుద్ధరించింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదయం దర్యాప్తు సంస్థలకు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. పెళ్లి విషయంలో ఏదైనా కుట్ర, నేరం జరిగిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునే విధంగా దర్యాప్తును కొనసాగించాలని సూచించింది. దర్యాప్తులో భాగంగా హదియా వైవాహిక జీవితంలో తలదూర్చవద్దని స్పష్టం చేసింది.

ఈ కేసులో ఎన్ఐఏ తరపున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్ విచారణ దాదాపుగా పూర్తయిందంటూ ఓ నివేదికను సమర్పించారు. అయితే ఈ కేసులో కీలక సాక్షులైన ఫజల్ ముస్తఫా, షిరిన్ షహాంద్‌లను విచారించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కేసులో ఇదివరకు తనపై వచ్చిన ఆరోపణలను ఎన్ఐఏ తోసిపుచ్చింది. నేరస్థురాలు లేదా ఉగ్రవాది అనే భావనతో హదియాని విచారించలేదని, దర్యాప్తును నిష్పాక్షికంగా పూర్తి చేశామని ఎన్ఐఏ స్పష్టం చేసింది. కాగా, తన మనోభీష్టం మేరకే ఇస్లాం మతంలోకి మారి, జహాన్‌ను వివాహం చేసుకున్నానని, అతనితో బంధాన్ని అలాగే కొనసాగించాలని తాను భావిస్తున్నట్లు హదియా సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News