Shikhar Dhawan: మళ్లీ చెలరేగిన ధవన్.. బంగ్లాను చిత్తు చేసిన భారత్!
- నిదహాస్ ట్రోఫీలో భారత్ తొలి విజయం
- ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
- అర్ధ సెంచరీతో అదరగొట్టిన ధవన్
నిదహాస్ ట్రోఫీలో భాగంగా గురువారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 140 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లు తొలుత బంగ్లా బ్యాట్స్‌మెన్ పనిపట్టగా, శిఖర్ ధవన్ బ్యాట్‌తో భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రత్యర్థి జట్టు 2.4 ఓవర్ వద్ద 20 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు సౌమ్య సర్కార్ (14) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దానికి మరో 15 పరుగులు జోడించాక మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (15) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాతి నుంచి బంగ్లాదేశ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది.
జయదేవ్ ఉనద్కత్, విజయ్ శంకర్ నిప్పులు చెరిగే బంతులకు క్రీజులో నిలదొక్కుకునేందుకు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. లిటన్ దాస్ (34), షబ్బీర్ రహ్మాన్ (30) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి భారత్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లు తీసుకోగా, విజయ్ శంకర్ రెండు, శార్ధూల్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17) మరోమారు పేలవ ఫామ్‌ను కొనసాగించగా నిలకడకు మారుపేరైన ఓపెనర్ శిఖర్ ధవన్ అద్భుత హాఫ్ సెంచరీతో తన జోరును కొనసాగించాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 28, మనీశ్ పాండే 27 పరుగులు చేశారు. ఫలితంగా మరో 8 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ విజయాన్ని అందుకుంది. రెండు కీలక వికెట్లు తీసిన విజయ్ శంకర్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.