Visakhapatnam District: ప్రేమన్నాడు, పెళ్లన్నాడు... పెళ్లిపీటలపై ఒంటరిని చేశాడు!
- దళిత యువతిని ప్రేమించిన యువకుడు
- పోలీసుల కౌన్సెలింగ్ తరువాత వివాహానికి అంగీకారం
- ముహూర్తం సమయానికి చెక్కేసిన యువకుడు
- అత్తింటి ముందు యువతి ధర్నా
రెండు సంవత్సరాలు ప్రేమించానని చెప్పి, కులాంతర వివాహానికి సిద్ధపడ్డ ఓ యువకుడు, ముహూర్తం సమయానికి మొహం చాటేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. పెళ్లిపీటలపై ఒంటరిగా మిగిలిపోయిన ఆ యువతి, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రావికమతం మండలం మర్రి వలస గ్రామంలో దళిత యువతి హరితేజ, కాపు సామాజిక వర్గానికి చెందిన శివాజీ రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
హరితేజ బీఎస్సీ చదువుతుండగా, శివాజీ పీజీ చేసి గుంటూరులో పని చేస్తున్నాడు. కులాలు వేరైనా తాను పెళ్లికి సిద్ధమేనని నమ్మిస్తూ వశపరచుకున్నాడు. ఆపై మరో యువతితో శివాజీ పెళ్లి నిశ్చయం కాగా, గ్రామ పెద్దలకు ఆమె ఫిర్యాదు చేసింది. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న గ్రామ పెద్దలు యువతికి న్యాయం చేయాలని సూచించారు. అప్పటికీ శివాజీ అంగీకరించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు కౌన్సెలింగ్ చేయగా, వివాహానికి ఒప్పుకున్న శివాజీ, లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఆపై నిన్న రోలుగంటలోని ఓ దేవాలయంలో పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముహూర్త సమయం వరకూ వస్తున్నానని నమ్మబలికిన శివాజీ, సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మోసం చేశాడు. దీంతో పెళ్లి పీటలపై వివాహానికి సిద్ధంగా ఉన్న హరితేజ, అత్తింటి ముందు నిరసన చేపట్టింది. కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.