Pakistan: అభియోగాలు రుజువైతే ముషారఫ్‌కు ఉరిశిక్ష!
- ముషారఫ్‌ను వెంటాడుతున్న దేశద్రోహం కేసు
- అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే ప్రత్యేక కోర్టు ఆదేశాలు
- 2016లో దుబాయ్ పారిపోయిన మాజీ అధ్యక్షుడు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (74) పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్న ఆయనపై నమోదైన అభియోగాలు రుజువైతే ఉరిశిక్ష లేదంటే జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. పాక్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ముషారఫ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గృహ నిర్భంధంలో పెట్టారు. వందమంది న్యాయమూర్తులను తొలగించారు. ఈ కేసులో ముషారఫ్‌పై 2014లో ప్రత్యేక ట్రైబ్యునల్ అభియోగాలు నమోదు చేసింది. తాజాగా ముషారఫ్‌ను అరెస్ట్ చేయడంతోపాటు, ఆయన ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యే కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ కేసులో హోంశాఖ అధికారులు ముషారఫ్ ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించారు.
1999 నుంచి 2008 వరకు పాక్‌ను పాలించిన ముషారఫ్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసుతోపాటు వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2016లో చికిత్స పేరుతో దుబాయ్ పారిపోయిన ముషారఫ్‌ను కోర్టు పరారీలో ఉన్న నిందితుడిగా పేర్కొంది. ముషారఫ్ కేసును విచారించేందుకు వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు పెషావర్ హైకోర్టు సీజే యెహ్యా ఆఫ్రిది నేతృత్వం వహిస్తున్నారు.