Aishwarya Rai: మీడియా ప్రవర్తనతోనే ఆరోజు అలా అసహనానికి గురయ్యాను: ఐశ్వర్యారాయ్ బచ్చన్
- గత నవంబర్ 20న తండ్రి జయంతిని పురస్కరించుకుని ఎన్జీవోతో కలిసి 100 మంది గ్రహణం మొర్రి చిన్నారులకు సర్జరీ చేయించిన ఐశ్వర్యారాయ్ బచ్చన్
- ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈవెంట్ కు వచ్చిన మీడియా ప్రతినిధులు
- ఆసుపత్రి, చిన్న పిల్లలు అన్న ఆలోచన లేకుండా హడావుడి
తన తండ్రి కృష్ణరాజ్ రాయ్ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సినీ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఒక స్వచ్చంద సంస్థతో కలిసి 100 మంది గ్రహణం మొర్రి చిన్నారులకు గత నవంబర్ లో సర్జరీ చేయించింది. ఆ సందర్భంగా మీడియా ప్రతినిధుల తీరుతో తీవ్ర అసహనానికి గురైంది. మరుసటి రోజు మీడియాలో ఆమె అసహనం ప్రముఖంగా ప్రసారమైంది. దీనిపై ఎట్టకేలకు ఆమె స్పందించింది. ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడుతూ, ఆ రోజు చోటుచేసుకున్న సంఘటన గురించి చెప్పడం చాలా కష్టమని చెప్పింది. తాము హాస్పిటల్ లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపింది. దీంతో తక్కువ స్పేస్ లో తల్లిదండ్రులతో కలిసి చికిత్స కోసం వచ్చిన పిల్లలు ఉన్నారని, అలాంటి సమయంలో మీడియా అక్కడికి వచ్చిందని గుర్తు చేసుకుంది. వారికి బైట్స్, ఫోటోస్ హడావుడి తప్ప అక్కడేం జరుగుతుందన్నది పట్టించుకోవడం లేదని చెప్పింది. మీడియా ప్రతినిధుల హడావుడి చూసి పిల్లలు భయపడిపోయారని, దాంతో తాను అసహనానికి గురయ్యానని తెలిపింది. తన అసహనం మరుసటి రోజు హెడ్ లైన్స్ లో కనిపిస్తుందని కూడా తనకు తెలుసని ఆమె పేర్కొంది. తాను ఎప్పుడూ ఎవరినీ బ్లేమ్ చెయ్యనని, పరిస్థితిని బట్టి స్పందించానని ఐశ్వర్యారాయ్ తెలిపింది.