Delhi: సెల్ఫీ కోసం పిస్తోల్‌తో పోజు...చివరకు ఏం జరిగిందో చూడండి...!
- తండ్రి పిస్తోల్‌తో అన్నతో సెల్ఫీ కోసం మైనర్ సరదా
- పేలడంతో అన్న అక్కడికక్కడే దుర్మరణం
- నిందిత మైనర్ తండ్రి పేరుపై పిస్తోల్ లైసెన్స్
- నిందితుడి తండ్రి నిర్లక్ష్యం కోణంలోనూ పోలీసుల దర్యాప్తు
ఈ మధ్యకాలంలో యువతకు సెల్ఫీల మోజు విపరీతమవుతోంది. ముందూ వెనుకా చూసుకోకుండా చిత్రవిచిత్రమైన సెల్ఫీల కోసం చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ విషాద ఘటనే ఆగ్నేయ ఢిల్లీలోని సరితా విహార్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకెళితే, యూపీలోని పాలీ గ్రామానికి చెందిన ప్రశాంత్ చౌహాన్ షాదారాలో ఒప్పంద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా, అతను గురువారం సరితా విహార్‌లోని తన చిన్నాన్న ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో 17 ఏళ్ల వయసున్న తన చిన్నాన్న కుమారుడు ఉన్నాడు. ఇద్దరూ సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు.
ఇంతలో తన తండ్రి పిస్తోల్‌ను బయటకు తీసుకొచ్చిన మైనర్ దాంతో పోజిచ్చి ఓ సెల్ఫీ తీసుకుందామని సరదా పడ్డాడు. పిస్తోల్‌తో పోజిస్తున్న క్రమంలో అది పేలడంతో బుల్లెట్ తగిలి చౌహాన్ అక్కడికక్కడే మరణించాడని డీసీపీ (ఆగ్నేయ ఢిల్లీ) చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. రక్తపు మడుగులో పడిన చౌహాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మరణించాడని వైద్యులు నిర్థారించినట్లు ఆయన చెప్పారు. "పిస్తోల్ లైసెన్స్ నిందిత మైనర్ తండ్రి ప్రమోద్ చౌహాన్ పేరుపై ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన ఈ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో లేరు" అని డీసీపీ తెలిపారు. మరోవైపు మైనర్ తండ్రి నిర్లక్ష్యమేమైనా ఉందా? అనే కోణంలోనూ ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన చెప్పారు.