Sri Lanka: ముష్ఫికర్ వీర బాదుడు.. శ్రీలంకపై బంగ్లాదేశ్ అలవోక విజయం!
- అద్భుతంగా ఆడిన బంగ్లాదేశ్
- రెచ్చిపోయిన ముష్పికర్ రహీం
- ముక్కోణపు టోర్నీలో మూడు జట్లకు చెరో విజయం
ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతో విజయాన్ని అందుకుంది. 215 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని సైతం సునాయాసంగా ఛేదించింది. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ దెబ్బకు లక్ష్యం చిన్నదైపోయింది. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక అదరగొట్టింది. ఓపెనర్లు దనుష్క గుణతిలక (26), కుశాల్ మెండిస్ (57) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. దానిని ఫస్ట్ డౌన్లో వచ్చిన కుశాల్ పెరీరా కొనసాగించాడు. 56 పరుగుల వద్ద గుణతిలక పెవిలియన్ చేరగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరాతో కలిసి మెండిస్ సమయోచితంగా ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పెరీరా కూడా దాటిగా ఆడాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉపుల్ తరంగ కూడా చెలరేగిపోయాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (47), లిటన్ దాస్ (43)లు శుభారంభాన్ని ఇచ్చారు. తర్వాత దానిని సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, కెప్టెన్ మహ్మదుల్లాలు కొనసాగించారు. ముష్పికర్ రహీమ్ అయితే శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన ముష్ఫికర్ రహీంకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ట్రోఫీలో మూడు జట్లు చెరో విజయంతో రెండేసి పాయింట్లు సాధించాయి. సోమవారం భారత్-శ్రీలంకలు మరోమారు పోటీ పడనున్నాయి.