Telugudesam: చంద్రబాబుకు, లోకేశ్ కు ధన్యావాదాలు : సీఎం రమేశ్
- నాపై అచంచల విశ్వాసంతో రెండో సారి రాజ్యసభకు పంపిస్తున్నారు
- టీడీపీ వచ్చిన తర్వాతే రాయలసీమ అభివృద్ధి జరిగింది
- కడపలో అన్ని స్థానాలను టీడీపీ గెలుచుకుంటుంది
- ఈసారి రాయలసీమలో వైసీపీ గల్లంతవడం ఖాయం : సీఎం రమేశ్
రెండోసారి తనను రాజ్యసభకు పంపిస్తున్నందుకు అధినేత చంద్రబాబుకు, నేత లోకేశ్ కు ధన్యావాదాలు తెలియజేస్తున్నానని సీఎం రమేశ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమలో అభివృద్ధి జరుగుతోందని, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నామని, ఈసారి రాయలసీమలో వైసీపీ గల్లంతవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘నాపై అచంచల విశ్వాసంతో చంద్రబాబునాయుడు, లోకేశ్ గారు నన్ను రెండో సారి రాజ్యసభకు పంపిస్తున్నారు. అందుకు, ధన్యవాదాలు. కడప జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అసలు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ అభివృద్ధి అనేది జరిగింది. అనంతపురం జిల్లాకు పరిశ్రమలు, డిఫెన్స్ ఇనిస్టిట్యూట్, అలాగే, గాలేరి-నగరి, హంద్రీనీవా నీటిని అందిస్తున్నామంటే ఈ ఘనత చంద్రబాబునాయుడిదే. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నాం. ముఖ్యంగా కడపలో రైతాంగానికి నీటిని అందిస్తున్నాం. వ్యవసాయం, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమను ముందుకు తీసుకెళ్తున్నాం’ అని అన్నారు.