mrps: ఈ నెల 13 న తలపెట్టిన మహాధర్నా వాయిదా వేస్తున్నాం : మందకృష్ణ మాదిగ
- ఇంటర్ మీడియట్ విద్యార్థుల పరీక్షల దృష్ట్యా ధర్నా వాయిదా
- విద్యార్థుల భవిష్యత్, వారి చదువు ముఖ్యం
- వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి : మందకృష్ణ
తెలంగాణలో ఈ నెల 13న తలపెట్టిన మహాధర్నాను వాయిదా వేస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ మీడియట్ విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ ధర్నాను వాయిదా వేశామని, విద్యార్థుల భవిష్యత్, వారి చదువులు చాలా ముఖ్యమని అన్నారు.
కాగా, ప్రధానంగా మూడు డిమాండ్లతో ఈ మహాధర్నాకు మందకృష్ణ పిలుపు నిచ్చారు. ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన కులసంఘాలు, విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. బీజేపీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని, వర్గీకరణ అంశానికి సంబంధించి కేంద్రాన్ని లోక్ సభలో, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నిలదీయాలని, ఇదే విషయమై ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఓ లేఖ రాయాలని మందకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.