Iran: ఇరాన్లో కూలిన టర్కీ విమానం.. కాలి బూడిదైన 11 మంది మహిళలు!
- టేకాఫ్ అయిన గంటకే కూలిన విమానం
- కాలి బూడిదైన మృతదేహాలు
- మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు
అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కీకి చెందిన ప్రైవేటు జెట్ విమానం కూలిన ఘటనలో అందులో ఉన్న 11 మందీ మృతి చెందారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 370 కిలోమీటర్ల దూరంలోని షార్-ఇ-కోర్డ్ సమీపంలో ఓ పర్వతాన్ని ఢీకొని విమానం కూలిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ చానల్ తెలిపింది. కొండను ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు చెలరేగాయని, అందులో ఉన్న 11 మంది మహిళలు సజీవ దహనం అయ్యారని ఇరాన్ పేర్కొంది.
ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల్లోని ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారని, అప్పటికే అందరూ మృతి చెందారని ఎమర్జెన్సీ బృందం అధికారిక ప్రతినిధి మోజ్తాబా ఖలేది తెలిపారు. మృత దేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
విమానం కూలిపోవడానికి ముందు ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని చూశామని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం విమానం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన గంట తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్‌కే చెందిన రెండు ఇంజిన్ల టర్బోప్రోప్ విమానం కూలిన ఘటనలో 65 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.