Sochi Olympics: 110 మందితో వస్తున్న విమానం హైజాక్... వెంటనే కూల్చివేయమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం... వెలుగులోకి 2014 నాటి ఘటన!
- 2014, ఫిబ్రవరి 7న సోచీలో ప్రారంభమైన ఒలింపిక్స్
- విమానంతో దాడి చేయనున్నారని పుతిన్ కు సమాచారం
- వెంటనే కూల్చేసి 40 వేల మందిని కాపాడాలని పుతిన్ ఆదేశం
- ఆపై అవాస్తవ సమాచారమని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరిట ఓ డాక్యుమెంటరీని తయారు చేసి ప్రదర్శించగా, అందులో చూపిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. 2014లో ఫిబ్రవరి 7న సోచిలో ఒలింపిక్స్ ప్రారంభం కాగా, ప్రారంభవేడుకలను తిలకించేందుకు సుమారు 40 వేల మంది హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పుతిన్ బయలుదేరుతున్న వేళ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఖర్కివ్ నుంచి ఇస్తాంబుల్ కు వెళుతున్న పీగాసన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-800 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, ఓ ప్రయాణికుడికి బాంబు అమర్చారని, దాన్ని సోచి వైపు తీసుకు వస్తున్నారని అధికారులు తెలపడంతో, ఒక్కసారిగా ఆందోళనకు గురైన పుతిన్, అధికారులతో సమావేశమై ఆ విమానాన్ని గాల్లోనే కూల్చివేయాలని ఆదేశించారట.
ఒలింపిక్స్ చూసేందుకు వచ్చిన 40 వేల మందిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పిన ఆయన, 110 మంది ప్రాణాలు పోయినా ఫర్వాలేదని స్పష్టం చేసి, ప్రారంభ వేడుకల్లో తాను కూడా పాల్గొంటానని చెబుతూ వెళ్లిపోయారట. ఆపై కాసేపటికి వచ్చిన మరో ఫోన్ కాల్ లో, తొలుత వచ్చిన ఫోన్ సమాచారం తప్పని, విమానంలో ఓ వ్యక్తి తాగి అల్లరి చేశాడని, సదరు విమానం ఇస్తాంబుల్ వైపుగానే వెళుతోందని అధికారులు చెప్పడంతో పుతిన్ ఊపిరి పీల్చుకున్నారట. ఈ ఘటనను పుతిన్ ప్రభుత్వంలోని అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సైతం ధ్రువీకరించడం గమనార్హం.