Governer: స్వామిగౌడ్ కు తగిలిన హెడ్ సెట్... సీరియస్ గా ఉన్న కేసీఆర్!
- గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్
- మైకులు విరిచి, హెడ్ సెట్లను విసిరేసిన ఎమ్మెల్యేలు
- రేపు అసెంబ్లీలో సస్పెన్షన్ తీర్మానం!
అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడేలా ప్రవర్తించడం, అందుబాటులో ఉన్న వస్తువులను చైర్ పైకి విసిరేయడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర సభ్యులు మైకులు విరిచేసి, హెడ్ సెట్లను తీసి పోడియం వైపు విసరడంతో, ఒక హెడ్ సెట్ గవర్నర్ పక్కనే కూర్చుని ఉన్న స్వామిగౌడ్ ను తాకింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, రేపు ఉదయం సభలో వీరిపై సస్పెన్షన్ వేటు వేయవచ్చని సమాచారం.
గవర్నర్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ నిన్ననే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు అసెంబ్లీ ప్రారంభం కాగానే, స్పీకర్ కు కాంగ్రెస్ సభ్యులు చేసిన రాద్ధాంతంపై ఫిర్యాదు చేసి, ఆధారాలు చూపి, వారిని సస్పెండ్ చేయాలన్న తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే, తొలుత చెప్పినట్టుగా బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేస్తారా? లేదా ఒకటి రెండు రోజులకే పరిమితం అవుతారా? అన్న విషయాన్ని తమ అధినేత నిర్ణయిస్తారని తెలిపాయి.