Telangana: నా కాలికీ గాయమైంది... 200 మంది మార్షల్స్ తో కొట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?: కోమటిరెడ్డి
- సభ ప్రారంభానికి ముందే మార్షల్స్ ను రంగంలోకి దించారు
- నా కాలికి ఎక్స్ రే తీయించి చూసుకోవాలి
- ఎమ్మెల్యే రామ్మోహన్ కూ గాయాలు
- అప్పట్లో నరసింహన్ ను హరీశ్ రావు గాయపరిచారు
- మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందే 200 మంది మార్షల్స్ ను రంగంలోకి దించిన తెలంగాణ ప్రభుత్వం తాము శాంతియుతంగా తెలియజేయాలనుకున్న నిరసనలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మార్షల్స్ తమను అడ్డుకుని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన, వారిని అడ్డుకునేందుకే తాను హెడ్ ఫోన్స్ ను విసిరానని తెలిపారు. మార్షల్స్ తన కాలికి గాయం చేశారని, ఏం జరిగిందన్న సంగతి, తాను ఎక్స్ రే తీయించి చూసుకోవాల్సి వుందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ కూ గాయాలు అయ్యాయని అన్నారు. పార్లమెంట్ లో నిత్యమూ పోడియంలోకి టీఆర్ఎస్ ఎంపీలు వెళుతున్నారని గుర్తు చేసిన ఆయన, అసెంబ్లీలో మాత్రం తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర కోసం తాము ఉద్యమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన రభసను గుర్తు చేసిన కోమటిరెడ్డి, నాడు ఓ పెద్ద పుస్తకాన్ని గవర్నర్ పైకి హరీశ్ రావు విసిరేశారని, అప్పట్లో నరసింహన్ కు గాయాలయ్యాయని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు. టీఆర్ఎస్ బెదిరింపులకు లొంగేది లేదని కోమటిరెడ్డి అన్నారు.