SBI: రూ. 13 వేల లిమిట్ ఉన్న కార్డుతో ఎస్బీఐ నుంచి రూ. 9 కోట్లు కొట్టేసిన ఘనుడు!
- రూ. 13 వేల పరిమితిపై విదేశీ ట్రావెల్ కార్డుల జారీ
- బ్యాలెన్స్ లో మార్పులు చేసిన వ్యక్తి
- మూడు నెలల్లో 374 లావాదేవీలు
- రంగంలోకి దిగిన సీబీఐ
కేవలం రూ. 13 వేలు (200 డాలర్లు) పరిమితితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన విదేశీ ట్రావెల్ కార్డును వాడి 1.41 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.10 కోట్లు) షాపింగ్ చేసిన ఘటన బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. విచారణ ప్రారంభించిన సీబీఐ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, యలమంచిలి సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ అనే కంపెనీ, ముంబైలోని ఎస్బీఐ ఎన్నారై శాఖ నుంచి 2016లో ఫారిన్ ట్రావెల్ కార్డుల్ని కొనుగోలు చేసింది. సదరు సంస్థ పేరిట బ్యాంకు ఈ కార్డులను జారీ చేసింది.
యలమంచిలి సంస్థ విదేశాలకు వ్యాపారాల నిమిత్తం వెళ్లే వాళ్లకు వీటిని అందిస్తుంటుంది. అయితే, ఓ వ్యక్తికి జారీచేసిన మూడు కార్డుల బ్యాలెన్స్ లో కుట్ర పూరితంగా మార్పులు చేసి నాలుగు బ్రిటిష్ ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా రూ. 9.10 కోట్ల మేర షాషింగ్ చేసిన విషయాన్ని యలమంచిలి సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ గుర్తించి బ్యాంకు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన బ్యాంకు ఐటీ సిబ్బంది, మూడు నెలల వ్యవధిలో మొత్తం 374 లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఒరాకిల్ డేటాబేస్ ద్వారా బ్యాలెన్స్‌లో మార్పులు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సీబీఐ విచారణ జరుపుతోంది.