Flight: విమానం పైలట్ చేసిన తప్పుతోనే 49 ప్రాణాలు పోయాయి!
- ల్యాండింగ్ లో పొరపాటు చేసిన పైలట్
- దక్షిణంవైపు నుంచి రమ్మంటే, ఉత్తరం వైపు నుంచి వచ్చిన విమానం
- మృతుల్లో చైనా, మాల్దీవుల పౌరులు కూడా
నిన్న నేపాల్ లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వేపై నుంచి పక్కకు జారి, మంటల్లో చిక్కుకుని 49 మంది ప్రాణాలు పోయిన ఘటన వెనుక పైలట్ తప్పిదముందని ప్రాధమిక విచారణలో వెల్లడైనట్టు నేపాల్ విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానం క్రాష్ ల్యాండింగ్ లో మరో 22 మంది తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. రన్ వేపై దిగుతూ విమానం స్కిడ్ అయిందని, ఆపై పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయి మండిపోయిందని నేపాల్ పోలీస్ ప్రతినిధి మనోజ్ నౌపేన్ వెల్లడించారు. గడచిన 25 సంవత్సరాల్లో నేపాల్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదేనని అన్నారు. విమానాశ్రయంలో దక్షిణపు వైపు నుంచి ల్యాండ్ అయ్యేందుకు పైలట్ కు అనుతి ఇవ్వగా, దాన్ని పట్టించుకోని పైలట్ ఉత్తరం వైపు నుంచి ల్యాండింగ్ కు ప్రయత్నించాడని నేపాల్ డీజీసీఏ అధికారి సంజీవ్ గౌతమ్ వెల్లడించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వెళ్లిన సూచనలనూ పైలట్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ విమానంలో నేపాల్, బంగ్లాదేశ్ వాసులతో పాటు కొందరు చైనా, మాల్దీవుల పౌరులు కూడా ఉన్నారని అన్నారు.