Congress: "పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోడియంలోకి వెళ్లడం లేదా?" అన్న కిషన్ రెడ్డికి కేసీఆర్ ఇచ్చిన కౌంటర్ ఇది!
- 500 మంది ఉన్న చోట 10 మంది కనిపించాలిగా
- వాదన వినిపించాలంటే పోడియంలోకి వెళ్లాలి
- అసెంబ్లీలో అలా చేస్తామంటే కుదరదు
- స్పష్టం చేసిన కేసీఆర్
11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ వేటు, మరో ఇద్దరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే, ఇంత కఠిన శిక్షలు అవసరం లేదని, తన స్థానంలో కూర్చునే ఉన్న జానారెడ్డిని ఎలా శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉదయం ఆయన మాట్లాడుతూ, సభలో ప్లకార్డులు తీసుకురాకుండా చూడాలన్న ఆలోచనకు తాను మద్దతిస్తానని, అయితే, పార్లమెంట్ లో ఎంపీలు ప్లకార్డులతో పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలను ఉద్దేశించి అన్నారు. ఆ వెంటనే మైక్ తీసుకున్న కేసీఆర్, కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ, లోక్ సభలో 500 మందికి పైగా సభ్యులుంటారని, టీఆర్ఎస్ కు ఉన్న 10 మందో, 12 మందో తమ వాదనను వినిపించేందుకు పోడియంలోకి వెళ్లడం తప్పేమీ కాదని తెలిపారు. అదే విధంగా విపక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తిస్తామని చెబితే ఊరుకోబోమని హెచ్చరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డిని తిరిగి సభలోకి ఆహ్వానించాలని కోరగా, అసెంబ్లీలో తీర్మానం చేసిన తరువాత తిరిగి వెనక్కు తీసుకునేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.