adhar: పాడుబడ్డ బావిలో వేలాది ఆధార్ కార్డులు!
- మహారాష్ట్ర యవత్మాల్లోని షిండేనగర్ ప్రాంతంలో ఘటన
- బావిలో చెత్తను తొలగిస్తుంటే బయటపడ్డ ఆధార్ కార్డులు
- దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు
ఓ పాడుబడ్డ బావిలో వేలాది ఒరిజినల్ ఆధార్ కార్డులు కనపడిన ఘటన మహారాష్ట్ర యవత్మాల్లోని షిండేనగర్ ప్రాంతంలో వెలుగులోకొచ్చింది. తాగునీటి కొరత ఉన్న నేపథ్యంలో సదరు బావిని బాగు చేసుకోవాలని ఆ గ్రామ యువకులు నిర్ణయించుకున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ రాజేష్ దేశ్ముఖ్తో పాటు కొంతమంది ఎన్జీవోలు బావి నుంచి చెత్తను తొలగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడానికి అక్కడకు వచ్చారు.
అయితే, గతంలో నైలాన్ గోనె సంచుల్లో ఆధార్ కార్డులను ప్యాక్ చేసి, వాటిని రాళ్లతో కట్టి ఎవరో వేలాది ఆధార్ కార్డులను ఆ బావిలో పారేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకోసం ఓ కమిటినీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.