Chandrababu: సెంటిమెంట్ కారణంగా తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం కాదా?: చంద్రబాబు
- సెంటిమెంట్లను చూసి డబ్బులు ఇవ్వడం కుదరదని జైట్లీ అన్నారు
- ఏపీకి సాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు
- ఇప్పుడు బీజేపీయే కేంద్రంలో అధికారంలో ఉంది
- ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, సాయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సెంటిమెంట్లను చూసి డబ్బులు ఇవ్వడం కుదరదని అన్నారని, మరి సెంటిమెంట్ కారణంగా తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ సమానంగా ఎదిగేందుకు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.
యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల మాదిరిగా ఏపీ ఎప్పటికీ పేదరికంలో మగ్గిపోవాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలను చెప్పామని, సాయం చేస్తే ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధిలో దూసుకుపోయేలా చేస్తామని చెప్పామని అన్నారు. బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసిన చందంగా రాష్ట్ర విభజన ఉందని ఆనాడు మోదీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి సాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు బీజేపీయే కేంద్రంలో అధికారంలో ఉందని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.