KTR: గల్ఫ్‌లో ఇబ్బందిపడుతున్న తెలంగాణవాసులకు అండగా నిలవాలి : కేటీఆర్ కు ఎమ్మెల్యేల వినతి
- అసెంబ్లీ లాబీలో కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్యేలు గోవర్థన్, గణేష్
- గల్ఫ్‌లోని తెలంగాణవాసుల సమస్యలను పరిష్కరించాలి
- సమన్వయకర్తను నియమించాలని కోరిన ఎమ్మెల్యేలు
గల్ఫ్‌లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అండగా నిలవాలని, వారిని ఆదుకోవాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల కోరారు. అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆయన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల గల్ఫ్‌లో తాను పర్యటించినపుడు అక్కడి తెలంగాణ వాసులు పలు సమస్యలను తన దృష్టికి తెచ్చారని కేటీఆర్‌కు బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. గల్ఫ్‌లోని తెలంగాణవాసులకు అండగా నిలవడమే కాకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సమన్వయకర్తను నియమించాలని కోరారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వలస వెళ్లిన తెలంగాణ వాసులను అక్కడి కంపెనీల యాజమాన్యాలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు చెప్పారు. అక్కడ పని చేస్తున్న తెలంగాణ వాసులకు వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని, పాస్ పోర్ట్స్ ని లాక్కుని వారిని నిర్బంధిస్తున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.