monsson: ఈ సారి భిన్నమైన వర్షాకాలం అన్న వార్తలపై స్పందించిన భారత వాతావరణ శాఖ
- వర్షాలకు విఘాతం కలిగించే లానినా ప్రభావం తక్కువే ఉండొచ్చు
- రుతుపవనాలపై ఇప్పుడే చెప్పడం కష్టం
- పరిస్థితుల్లో మాత్రం వేగంగా మార్పులు
2018లో రుతుపవనాలు భిన్నంగా ఉంటాయన్న అంచనాలపై భారత వాతావరణ శాఖ, ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్ స్పందించాయి. వాతావరణ పరిస్థితులను గమనించినట్టయితే ఈ సారి రుతుపవనాలు భిన్నంగా ఉంటాయన్నదానికి ఇప్పటి వరకు ఎటువంటి సంకేతాలు లేవని పేర్కొన్నాయి. రుతుపవనాల పరిస్థితుల్లో మాత్రం వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపాయి. లానినా వాతావరణ స్థితి వేసవి ఆరంభం వరకు మోస్తరుగా ఉండి ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. వర్షాలను దెబ్బతీసే లానినా ప్రభావం ఈ సారి తక్కువగానే ఉండొచ్చని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, మరికొన్ని నెలలు గడిస్తేనే పరిస్థితులపై స్పష్టత వస్తుందని ఐఎండీ స్పష్టం చేసింది. రుతుపవనాలు బలంగా ఉంటాయా? లేదా బలహీనంగా ఉంటాయా అన్నది ఇప్పుడే అంచనా వేయడం చాలా ముందస్తు అవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ చెప్పారు.